పవన్ కల్యాణ్ 'మ్యాజిక్ డ్రెయిన్స్' ఒక గేమ్ ఛేంజర్: పీవీ సింధు ప్రశంసలు

  • ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆలోచనలను ప్రశంసించిన పీవీ సింధు
  • 'మ్యాజిక్ డ్రెయిన్స్' గ్రామీణ పారిశుద్ధ్యంలో విప్లవాత్మక మార్పు అని వ్యాఖ్య
  • సాధారణ డ్రెయిన్లతో పోలిస్తే 80 శాతం ఖర్చు ఆదా అవుతుందని వెల్లడి
  • పవన్ ముందుచూపుతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్ష
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వినూత్న ఆలోచనలతో గ్రామీణాంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తున్నారని, ఆయన ప్రవేశపెట్టిన 'మ్యాజిక్ డ్రెయిన్స్' పథకం పల్లెల్లో పారిశుద్ధ్య విప్లవానికి నాంది పలికిందని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు కొనియాడారు. పవన్ కల్యాణ్ 20 నెలల పాలనపై తన అభిప్రాయాలను పంచుకుంటూ విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో, గ్రామీణ ప్రాంతాల్లోని మురుగునీటి సమస్యకు ఈ పథకం ఒక అద్భుతమైన పరిష్కారమని ఆమె అభివర్ణించారు.

ఈ సందర్భంగా పీవీ సింధు మాట్లాడుతూ, "పాలనా వ్యవహారాలలో కొత్తే అయినా, పవన్ కల్యాణ్ గారు వినూత్న కార్యక్రమాలతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. మన దేశంలో అధిక శాతం ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అయితే, గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ముఖ్యంగా మురుగునీటి పారుదల వ్యవస్థ పెద్ద సవాలుగా ఉంటుంది. ఈ సమస్యకు పవన్ కల్యాణ్ గారు 'మ్యాజిక్ డ్రెయిన్స్' రూపంలో ఒక చక్కటి, శాశ్వత పరిష్కారాన్ని కనుగొన్నారు" అని అన్నారు.

మ్యాజిక్ డ్రెయిన్స్ పనితీరును వివరిస్తూ, "ఇళ్ల నుంచి వెలువడే మురుగు నీటిని ఇంకుడు గుంతలతో కూడిన ఈ డ్రెయిన్లు క్షణాల్లో భూమిలోకి ఇంకేలా చేస్తాయి. మూడంచెల ఫిల్టర్ బెడ్ల ద్వారా నీటిని శుద్ధి చేసి, భూగర్భ జలంగా మారుస్తాయి. దీనివల్ల మురుగునీరు నిల్వ ఉండటం, దుర్వాసన రావడం వంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. గ్రామీణ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో ఈ డ్రెయిన్లు కీలక పాత్ర పోషిస్తాయి" అని సింధు వివరించారు.

ఈ పథకం వల్ల ఖర్చు కూడా గణనీయంగా ఆదా అవుతుందని ఆమె పేర్కొన్నారు. సాధారణ సిమెంట్ డ్రెయిన్ల నిర్మాణంతో పోలిస్తే, మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణ వ్యయం 80 శాతం వరకు తక్కువగా ఉంటుందని తెలిపారు. ఇది ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంతో మేలు చేస్తుందన్నారు.

"పవన్ కల్యాణ్ గారు భవిష్యత్తులో కూడా ఇలాంటి ముందుచూపుతో కూడిన కార్యక్రమాలను మరిన్ని చేపట్టాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో, పవన్ కల్యాణ్ దార్శనికతతో గ్రామీణాంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో పయనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని పీవీ సింధు తన సందేశాన్ని ముగించారు.

P. V. Sindhu
Pawan Kalyan
Magic Drains
Andhra Pradesh
PV Sindhu
Rural Development
Sanitation
Chandrababu Naidu
Narendra Modi
Groundwater Recharging

More Telugu News